Tuesday, October 1, 2019

పాత్రదానం:: -- చందమామ కథలు(Chandamama Kathalu) - 202


ఒక రాజు ప్రజలు తమకు కలిగే అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తితో రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చేవాణ్ణి పిలిచి రెండు చపాతీలు చేసి ఒక చపాతీలో విలువైన నగలు దాచమన్నాడు.
తరువాత ఒక ఉద్యోగిని పిలిచి, ఆ రెండుచపాతీల గురించి చెప్పి, నగలు దాచిన చపాతీని చూపుతూ, ‘‘దీనిని పాత్రుడైన వాడికి దానం చెయ్యి. రెండవదాన్ని నీ వద్దకు భిక్షకువచ్చే వారి కెవరికైనా ఇవ్వు,’’ అన్నాడు. ఆ రోజు వచ్చిన ఇద్దరు భిక్షకులలో ఒకడు పొడవాటి గడ్డం, పాదాల వరకు జీరాడే అంగీతో గొప్ప సాధువులాగా ఉన్నాడు. రెండవవాడు మామూలు బిచ్చగాడిలా ఉన్నాడు. రాజోద్యోగి నగలు దాచిన చపాతీని సాధువుకిచ్చి, రెండవదాన్ని మామూలు బిచ్చగాడికిచ్చాడు.
సాధువు చపాతీ అది బరువుగా ఉండడంతో ఆశ్చర్యంగా చూసి ఏమనుకున్నాడో కానీ పక్కనున్న బిచ్చగాడికేసి ఆప్యాయంగా చూసి ‘‘మిత్రమా, ఈ చపాతీ కాస్త బరువుగా ఉన్నట్టుంది. నీచేతిలో ఉన్నదానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటాను. ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు. మనం మార్చుకుందామా?’’ అన్నాడు. బిచ్చగాడు మరేమీ మాట్లాడకుండా, తన చపాతీని సాధువు చేతిలో పెట్టి, అయన దగ్గరి చపాతీని తీసుకుని తనదారిన వెళ్ళిపోయాడు.

దీన్నంతా రాజు తన మేడ నుంచి గమనించి ‘‘సాధువు నగల వ్యామోహంలో పడకూడదన్నది దేవుడి సంకల్పంకాబోలు! సాధువును ధనవంతుడిగా మార్చడం దేవుడికి సమ్మతం కాదేమో!’’ అనుకున్నాడు. అయితే చపాతీని ఇస్తూ ఆ సాధువు నవ్విన నవ్వు రాజులో తీరని ఉత్సుకతను రేకెత్తించి ఇద్దరు గూఢచారులను పిలిచి, ఆ ఇద్దరినీ రహస్యంగా అనుసరించి వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుని రమ్మన్నాడు. సాయంకాలానికి ఇద్దరు గూఢచారులూ వచ్చి జరిగిన సంగతులు రాజుగారికి ఇలా చెప్పేరు సాధువు చపాతీని తీసుకుని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు. అంగీనీ, పెట్టుడుగడ్డాన్నీ తీసి పక్కన పెట్టి చపాతీని, దానితో పాటు తెచ్చుకున్న వంటకాలనూ తృప్తిగా తిన్నాడు. మళ్ళీ పెట్టుడుగడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకుని, అంగీని ధరించి సాధువులా భిక్షానికి బయలుదేరేడు.

బిచ్చగాడు తన గుడిసెకు చేరి చపాతీని ముక్కలుగా కోయబోయి , అందులోని నగలను చూసి అమితాశ్చర్యం చెందాడు. దానిని చూసిన అతడి వెళ్ళాం, ‘‘ఆహా, ఇంతకాలానికి దేవుడు కరుణించాడు. ఇవన్నీ, నావే,’’ అన్నది. అయితే, బిచ్చగాడు ఏమాత్రం తొందర పడకుండా, ‘‘దేవుడు దీనిని ఒకగొప్ప వ్యక్తి ద్వారా ఒక సాధువుకు ఇప్పించాడు. ఆ సాధువు దీనిని నాకిచ్చాడు. ఇది నా నిజాయితీకి పరీక్ష. మొదట నేను ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరబాటున చపాతీలో పెట్టారేమో తెలుసుకోవాలి. ఒకవేళ దీనిని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగిలించి ఇందులో దాచారేమో చూడాలి. అలాకాక ఆ గొప్ప వ్యక్తే ఉద్దేశపూర్వకంగానే దీనిని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్టయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా? ఇవన్నీ ఏవీ కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు. ప్రభువులే దయతలచి మనకు ఇస్తే, మనం కొన్ని నగలు తీసుకుని, ఇరుగు పొరుగుకు కొన్ని ఇద్దాం,’’ అన్నాడు భార్యతో. ఆ తరవాత నగలను తీసుకుని, రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. "

ఇంతలో రాజోద్ద్యోగి అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు అతడి నిజాయితీకి సంతోషించి, ఆ నగలను అతనికే ఇచ్చి, మరిన్ని కానుకలతో సత్కరించాడు. ‘‘సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడు ఒక పాత్రుడికే అందించాడు. అయితే, ఈ సంఘటన నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం అమూల్యమైనది. వాళ్ళు చపాతీని మార్చుకోవడం చూడగానే, నాకు తోచిన వివరణతో తృప్తి పడి సరిపుచ్చుకుని వుంటే అసలు నిజం బయటపడి వుండేదికాదు. అంటే, మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రం భావ్యం కాదు,’’ అన్నాడు వివేకి అయిన ఆ రాజు సభికులతో. 

No comments:

Post a Comment