Monday, September 30, 2019

కోశాధికారి ఎన్నిక -- చందమామ కథలు(Chandamama Kathalu) - 189


అనగనగా కాదంబినీ రాజ్యాన్ని అశోకవర్మ మహారాజు పరి పాలిస్తున్నాడు. అతనికి సమర్ధుడైన మంత్రి ఉన్నాడు. ధనాగారము వ్యవహారాలు చూసే కోశాధికారి పదవి ఖాళీ అయింది. ఆ పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసి నియమించాలి.

మహారాజు ఆదేశముపై మంత్రి కోశాధికారి పదవి కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని రాజ్యమంతటా చాటింపు వేయించాడు. చాలా మంది విద్యావంతులు తమ పరిచయ పత్రాలను జతచేసి దరఖాస్తులు పంపు కున్నారు. మహారాజు, మంత్రి కలిసి దరఖాస్తులన్నింటినీ పూర్తిగా పరిశీలించారు. వారి పరిశీనలనలో ముగ్గురు చివరి దాకా మిగిలారు. ఆ పదవిలో రామరాజు, భీమరాజు, దీనదయాళుడు. ముగ్గురిలో ఒకరిని నియ మించాలి. వాళ్లకు పరీక్షలు నిర్వహించి ఒకరిని ఎంపిక చేసే బాధ్యత మహారాజు మంత్రికి అప్పగించాడు.

మంత్రి ఆ ముగ్గురినీ కొలువుకు పిలిపించుకున్నాడు. శారీరకంగా ముగ్గురూ బాగానే ఉన్నారు. ముగ్గురి విద్యా ర్హతలు బాగానే ఉన్నాయి. వాళ్లకో పరీక్ష పెట్టి విజయం సాధించిన వ్యక్తిని కోశాధికారి పదవి కోసం ఎంపిక చేయాలనుకున్నాడు.

ఆ ముగ్గురికీ తలా అయిదు వందల వరహాలిచ్చి ‘ మీరు రెండు నెలలు దేశాటన చెయ్యాలి. రెండు నెలలవగానే నా వద్దకొచ్చి మీ అనుభవాలు చెప్పాలి. ఈ వరహాలు ఖర్చుల కోసం. మిగిలినవి తిరిగి ఇవ్వాలి. మీ కదలికలను గూఢచారుల ద్వారా తెలుసు కుంటాను అని చెప్పి పంపించాడు.

ముగ్గురూ దేశాటన చేస్తూ రాజ్యములోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు. రెండు నెలలవగానే ముగ్గురూ మంత్రి వద్దకొచ్చారు. మహారాజుగారి సమక్షంలో తమ అనుభవాలను చెప్పారు. మంత్రి ఖర్చుల గురించి అడిగాడు.

రామరాజు ముందు కొచ్చి నేను వెళ్లిన ఊళ్లో కొన్ని చోట్ల అద్దెగది తీసుకుని ఉన్నాను. వరహాలిస్తూ మంచి పూటకూళ్ల ఇంట్లో భోజనం చేశాను. వరహాలు మిగలలేదు, తగలలేదు అన్నాడు. భీమరాజు ఏ ఊరికెళ్లినా మంచి అద్దెగదిలో ఉన్నాను. కొన్ని చోట్ల పూటకూళ్ల ఇంట్లో మరికొన్ని చోట్ల పేదరాశి పెద్దమ్మ వద్ద వరహాలిస్తూ భోంచేశాను. ఓ గుర్రాన్ని అద్దెకు తీసుకుని తిరిగాను. గుర్రం ఖర్చు, నా ఖర్చుకు ఆ వరహాలు సరిపోలేదు. అప్పు చేయాల్సి వచ్చింది అన్నాడు. దీనయాళుడు ‘ఏ ఊరికెళ్లినా ధర్మసత్రములో ఉన్నాను, పేదరాశి పెద్దమ్మ వద్ద ఒక్కో వరహాయిస్తూ భోంచేశాను. దేశాటనంతా కాలినడకన సాగింది. మూడొందల నలభై వరహాలు మిగిలాయి అని వరహాలు మంత్రికి తిరిగి ఇచ్చాడు.

మహారాజు నిర్ణయాధికారాన్ని మంత్రికిచ్చాడు. మంత్రి ముగ్గురినీ చూస్తూ ప్రజల ధనమది, కోశాధికారి సాధారణంగా జీవిస్తూ కష్టపడి పనిచెయ్యాలి. దీనదయాళునికన్ని అర్హతలున్నాయి అని దీనదయాళుని పేరునే సిఫార్సు చేశాడు. మహారాజు దీనదయాళుడిని కోశాధికారిగా నియమించాడు.

No comments:

Post a Comment