Monday, September 30, 2019

చెల్లుకి చెల్లు -- పంచతంత్ర కథలు(Panchatantra Kathalu) - 9

చంద్రపురాన్ని పాలిస్తున్న రాజు పేరు చంద్రభూపతి. అతని ఉద్యానవనానికి రోజూ ఓ కోతి మూక వస్తుండేది. అంతఃపురంలోని పిల్లలు వాటికి పళ్ళూ పలహారాలూ విసిరి ఆనందించేవారు. కోతులన్నిటికీ ఓ ముసలికోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, కాపాడుతుండేది.‘పొరపాట్న కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి. చంద్రభూపతి మంచివాడు కాదు. మహాక్రూరుడు.’ ముసలి కోతి చెబుతున్నా వినలేదు కోతిమూక. పళ్ళకీ, పలహారాలకీ ఆశపడి, పిల్లలతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకున్నాయి. అల్లరి చేయసాగాయి. చూశాడది చంద్రభూపతి. కోపం వచ్చిందతనికి. సేవకులికి చెప్పి వాటన్నిటినీ చంపించేశాడు. కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతుంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు.

చాటుగా ఉండి, ఏడుస్తూ కూర్చున్నాడు. తర్వాత ఎలాగయినా చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు.ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగుదీశాడు కోతిరాజు. వెతగ్గా వెతగ్గా ఓ సరోవరం కనిపించింది దానికి. దాహం తీర్చుకునేందుకు తొందరపడి నీళ్ళలోకి దూకకుండా, తెలివిగా ప్రవర్తించింది. గట్టున ఉన్న ఇసుకను పరిశీలనగా చూసింది. ఇసుకలో చెరువుకి వచ్చిన వారి అడుగుజాడలే ఉన్నాయి కాని, వారు తిరిగి వెళ్ళినట్టుగా ఒక్క జాడ కూడా కనిపించలేదు. ప్రమాదాన్ని పసి గట్టింది కోతి. సరోవరంలోనికి ప్రవేశించడం క్షేమం కాదనుకుంది. ఒడ్డున పడి ఉన్న తామరతూడుని తీసుకుని, ఆ గొట్టం ద్వారా నీరు తాగుతూ దాహం తీర్చుకోసాగింది. అంతలో సరోవరం మధ్య నుంచి ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. మెచ్చుకోలుగా అన్నాడిలా.‘దాహం తీర్చుకోవడమే ప్రధానంగా మనుషులూ, జంతువులూ ఈ సరోవరంలోకి దూకి, నాకు ఆహారమయిపోయారు. నువ్వు మాత్రం తెలివిగా ప్రవర్తించి ప్రాణాన్ని కాపాడుకున్నావు. నచ్చావు నాకు. కోరుకో, నీకేం కావాలో, వరం ప్రసాదిస్తాను.’ఆలోచించసాగింది కోతి. తర్వాత తేరుకుని, ఇలా అడిగింది.‘ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు?’’‘‘ఈ సరోవరంలో ప్రవేశించిన ఎంతమందినయినా ఒక్కసారిగా తినగలను.’‘అయితే నేను నీకు వందలాది మంది నరులను కానుక చేస్తాను, నరమాంసాన్ని తనివితీరా తిందూగాని. దానికి ముందు నువ్వో పని చెయ్యాలి. నీ మెడలోని రత్నహారాన్ని నాకివ్వాలి.’ అంది కోతి.‘ఎందుకు?’ అడిగాడు రాక్షసుడు.

‘తర్వాత చెబుతాను, ముందు ఇవ్వు. నా పని కాగానే నీ హారం నీకిచ్చేస్తాను.’ అంది కోతి.‘అయితే ఇంద’ రత్నహారాన్ని కోతికి అందేట్టుగా విసిరాడు రాక్షసుడు. అందుకుని, దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చూసి, బాగానే ఉందనుకుంది. మెడలో ధరించింది. మెరిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది.‘రాజా’ అని పిలిచింది.‘ఏమిటి? బతకాలని లేదా?’ కోపంగా అడిగాడు చంద్రభూపతి.‘కోపగించుకోకు రాజా! నేను చెప్పేది జాగ్రత్తగా విను.’ అంది కోతి. చెప్పసాగిందిలా.‘నేను ఉంటోన్న వనంలో ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో లెక్కలేనన్ని రత్నరాసులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బావుంటుంది. అక్కడుండి ఏం ప్రయోజనం? సేవకుల్ని పంపించు మహారాజా, సరస్సు చూపిస్తాను. సొమ్ములన్నీ సొంతం చేసుకో’‘నీ మాటలు నమ్మమంటావా?’’ అడిగాడు చంద్రభూపతి.‘నమ్మండి మహారాజా! ఇదిగో చూడండి.’’ తన మెడలోని రత్నహారాన్ని చూపించింది రాజుకి.

‘ఇది, నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణం నా కంఠాన్ని అలంకరించింది. ఇలాంటివి మరికొన్ని మెడలో పడతాయోమోనని మళ్ళీ మునగబోతుంటే అప్పుడు జలదేవత ప్రతక్షమయింది. అయ్యి, సూర్యుడు ఉదయిస్తూన్న క్షణంలో ఈ సరస్సున మునిగివారికి ఒకొక్కరికీ ఒకొక్క హారమే ప్రసాదిస్తాను. సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు. అలాగే పదేపదే మునిగినా ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదంది.’కోతి చెప్పింది నిజమా? అబద్ధమా? అని ఆలోచించలేదు రాజు. నిజమే అయి ఉంటుందని ఆత్రం చెందాడు. ధనరాసులతో కోశాగారం నిండిపోయి ఉన్నా, కక్కూర్తి పడ్డాడు. బంధు మిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయల్దేరాడు. ‘అదిగో సరస్సు’ అంటే ‘అదిగదిగో సరస్సు’ అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు.

బంధు మిత్ర సపరివారంగా సూర్యోదయానికి ముందే కోతి వెంట బయల్దేరాడు రాజు.సరస్సును చేరుకున్నాడు.‘అంతా సరస్సులో స్నానం చెయ్యండి. మునగండి’ అంది కోతి. మునిగారంతా. ఒక్కరూ తేలలేదు. అంతా ఏమయిపోయారో తెలియలేదు. ఆందోళన చెందాడు రాజు. కోతి కోసం చూశాడు. అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద కూర్చుని ఉంది. కిచకిచమని నవ్వుతూ ఉంది.

‘నవ్వడం ఆపు. ముందు నా బంధు మిత్రులు ఏమయ్యారో చెప్పు?’ అడిగాడు రాజు.‘చెబుతా! చెబుతా! మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారమయిపోయి ఉంటారు? ఆపైన పరలోకానికి చేరుకుని ఉంటారు. అక్కడ నా వాళ్ళను కలుసుకుని ఉంటారు.’ అంది కోతి. అప్పుడు అర్థమయింది రాజుకి. తను కోతిమూకను చంపించానని, ఈ కోతిరాజు, తన పరివరాన్నంతా ఈ రకంగా మట్టుబెట్టింది. మాయచేసి, మోసం చేసింది. తట్టుకోలేకపోయాడు రాజు.

‘దుర్మార్గుడా! ఎంత దారుణానికి ఒడిగట్టావు.’ అన్నాడు.‘ఎవరు ఒడిగట్టారు? ముందు నువ్వు ఒడిగట్టావు. నా పరివారాన్నంతా చంపావు. దాంతో నేను నీ మీద కసి తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి. చెల్లుకి చెల్లు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. నీకూ ఎవరూ లేరు. నాకూ ఎవరూ లేరు. ఇద్దరం ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదాం.’ అంది కోతి.’’ కథను ముగించాడు మిత్రుడు.

No comments:

Post a Comment