Tuesday, October 22, 2019

ఉండిపోరాదే..ప్రేమ నీదేలే.. పార్ట్ 1.. -- తెలుగు కథలు(Telugu Kathalu) - 58

 పరిచయాలు అన్ని గొప్పగా ఉండవు, ప్రేమలు అన్ని నాణ్యంగా ఉండవు, మనం వెళ్లే దారిలో ఉత్సాహలు ఉంటాయి ఉప్పెనలు ఉంటాయి వాటికి ఎదురుగా నిలబడి బ్రతకడమే మన జీవితం.అలాంటి ఈ జీవితంలో ఒక ప్రేమ పరిచయం మీకోసం.
సాఫీగా హ్యాపీగా సాగిపోతున్న నా జీవితంలో స్నేహితులు, పార్టీలు, నా ఉద్యోగం నేను చేసే కంపెనీ వాడికి నా జీవితం ఊడిగం తప్ప ఏమీ ఉండేవి కాదు. ఎలా ఉన్నా ఏమి చేసిన చేతికి జీతం అందిన వెంటనే మొదటగా చేసే మంచి పని బిర్యానీ తినడం, ఒక సినిమా చూడడం, నైట్ ఇంటికి వచ్చి అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా ఒక దమ్ము కొట్టడం.
ఏంటి నన్ను నేను పరిచయం చేసుకోకుండా వెధవ సోది చెప్తున్న అని అనుకుంటున్నారా. చెప్తా వినండి ఇక్కడ ఈ కథ రాస్తున్న రమేష్ ఆకుల గారు నన్ను మీకు పరిచయం చేస్తారు, నా పేరు నందు అంట ఇక నా ఆట ఎలా ఆడిస్తారో ఆయన మీరే చూడండి.
నా పేరు నందు, నా పూర్వ జన్మలో చేసిన పాపం వలన సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న. అన్ని బానే ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు కదా అలా అయిపోయింది నా జీవితం. పల్లెటూరి జీవితంలో పెరిగిన వాడిని ఎటు చూసినా స్వచ్ఛమైన గాలి కల్మషం లేని మనుషులు ఉండేవారు. పల్లెటూరి వాతావరణంలో పెరిగిన వాడిని అనుకోకుండా జీవితం మొత్తాన్ని పట్నంలో తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదు నాన్న నేను మన ఊరు వచేస్తా అంటే ఇక్కడ నాలుగు గేదెలు ఉన్నాయి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో ఇంకో నాలుగు గేదేలు కొని మన పాలేరుని తీసేసి నిన్ను పాలేరు చేస్తాను అన్నాడు. అమ్మో వద్దులే అని ఇక్కడే ఉన్నాను.
నా వయసు ఏమో 28 సంవత్సరాలు, చేతిలో బైక్ ఉంది,మంచి జీతం వలన ఇంట్లోకి 60 శాతం ఇచ్చేసిన మిగిలిన 40 శాతం డబ్బులు మనవే. పొద్దునే 8 గంటలకు లెగడం స్నానం చేయడం వీధి చివర ఉన్న టిఫిన్ బండి దగ్గర నాలుగు వడ ఒక దోస తిని ఆఫీసుకి పోవడం మళ్ళీ ఇంటికి రావడం. ఇల్లు అంటే ఏదో పెద్ద ప్యాలెస్ అనుకున్నారు ఒక డబల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ మాది. అందులో సగం తిని తినక బ్రతుకు మీద విరక్తి చెందిన నలుగురం ఉంటాము. వచ్చిన మొదట్లో అందరం బాగానే ఉన్నాము కానీ ఉండి ఉండి ఈ హైదరాబాద్ లో మేము కనపడని ఉగ్రవాదులు లాగా తయారు అయ్యాం.
మా నలుగురిలో ఒకడికి ఒకడికి సంబంధం ఉండదు, ఒకడు పొద్దున్నే జాబ్ కి పోతాడు, ఇంకొకడు అర్ధరాత్రి పోతాడు దీనెమ్మ కర్మ గాని వీకెండ్ అయిన కలుస్తామా అంటే వాళ్ళు వాళ్ళ లవర్స్ తో గడిపేస్తు ఉంటారు ఆ రెండు రోజులు, మనకి లవర్ లేదు కదా అందుకే యూట్యూబ్ లో మనకి పనికి వచ్చిన రాకపోయినా ఆ రెండు రోజులు వీడియోలు చూస్తూ ఉంటాను ఏమి చేయాలో తెలియక. నాకు ఒక లవర్ ఉంటే బాగుండును అనిపించింది. వెంటనే రెండు బీర్లు తెచ్చుకుని ఒకటి తాగాక రెండోది తాగుతూ ఉండగా గతం గుర్తుకు వచ్చేస్తుంది. గతంలో నాకు ఒక లవర్ ఉంది భయ్యా ఆ ప్రేమ భయానక సంఘటనలు మీకోసం.
గతంలోకి పోయాను నేను కాలేజి చదివే రోజుల్లో ఒక అమ్మాయి ఉండేది తన పేరు శ్రీలత. నేను ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఎప్పుడు నాకు కాలేజీలో కనపడని పాప ఈ శ్రీలత పాప. ఎక్కడ కనపడింది అంటారా తను, మా నాన్నకు ఎవరో చెప్పారు అంట కాలేజి లైబ్రరిలో చాలా పుస్తకాలు ఉంటాయి అవి చదివితే మీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని. ఇంకేముంది రోజు ఫోన్ లో మాట్లాడుతూ నందు లైబ్రరీ కి ఎప్పుడు వెళ్తున్నావు అనేవాడు. ఇక ఈ నొప్పి నా వల్ల కాదు అని మా క్లాస్ మేట్స్ అందరికి చెప్పేసా నేను లైబ్రరీ కి వెళ్తున్న అని, వద్దురా మనకి అది సెట్ అవదు రా అని ఒకటే గోల.
ఎవడి మాట వినేది లేదు అని లైబ్రరీ కి వెళ్దాం అని సిద్ధం అయిపోయాను. ఇంతకీ లైబ్రరీ ఎక్కడ ఉందో ఇప్పటి దాకా నాకు తెలియదు ఆ లైబ్రరీ వెతకడానికి అరగంట సమయం పట్టింది. ఆవేశంతో లైబ్రరీ కి వెళ్లి పనికి వచ్చే రెండు బుక్స్ ఇవ్వండి అన్నాను. నేను అలా అన్నానో లేదో మీరు కొత్త లైబ్రరీ కి అన్నాడు, హా అవును అన్నాను. పోయి నీకు కావాల్సిన బుక్స్ తీసుకుని చదువుకో గాడిద అన్నాడు ఆ లైబ్రేరియన్.
ఓ మై డాడీ నువ్వు కూడ ఇప్పటిదాక తిట్టలేదు ఇక్కడ ఈ లైబ్రరీయన్ నన్ను తిట్టాడు అని బుక్స్ వెతకడం మొదలు పెట్టాను. మొత్తానికి నాకు ఉపయోగపడే రెండు బుక్స్ తీసి ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసి అక్కడ కూర్చుని చదవడం మొదలు పెట్టాను. నాకు నేను ఒక అరగంట బుద్ధుడు అనుకుని చదువుతూ ఉండగా ఒక్కసారిగా హలో సర్ అని ఒక స్వీట్ వాయిస్ వినిపిస్తోంది. నో నో అమ్మాయిలు వద్దు చదువు చదువు ముద్దు అనుకుంటున్నాను.
మెడ మీద దురద వచ్చి కొంచెం తలఎత్తి మెడ గోక్కుంటే ఒక్కసారిగా ఇప్పటిదాకా చదివిన చదువు వరదల్లో కొట్టుకు పోయినట్టు అనిపిస్తుంది. ఏమి అందం ఏమి అందం పసుపు కుంకుమ కలిపిన పాల రాతి అందంలా ఉన్న ఆ అమ్మాయిని చూసాక ఇక గుండె ఆగడం లేదు,అసలే పిచ్చి ఎక్కించే అందం అందులోను ఇంకా అందంగా ఉండే డ్రెస్ వేసింది. ఉరుములు మెరుపులు తుఫానులు సునామిలు అన్ని ఒక్కసారిగా వచ్చినట్టు వచ్చేస్తున్నాయి, ఇంత అందం ఎక్కడ ఉందిరా మన కాలేజీలో నాకు కనపడకుండా అనిపించింది. వెంటనే నేను తన పేరు తెలుసుకోవాలని లైబ్రరీ రిజిస్టర్ బుక్ లో తన పేరు చూసాను కె.శ్రీలత cse అని. ఇక చూసుకోండి నా శ్రీలత నా శ్రీ నా బంగారం అని రాయడం మొదలుపెట్టి శ్రీలత వెనకాల ఎలా పడ్డానో తరువాత రాసే ఎపిసోడ్ లో చదవండి..

No comments:

Post a Comment