Monday, October 7, 2019

-- యుగాంతం(Yugantham) - 23

ఇండియన్ టైమ్స్ పత్రికలో పడిన ఆ చిన్న వార్త చాలా సంచలనాన్ని కలిగించింది. భూమి ఆఖరవుతుంద? అన్న ఉత్తరాలూ, "చివరి రోజు? మీద వ్యాసాలూ, మరుసటి రోజుకే పత్రికా కార్యాలయానికి వచ్చి చేరుకున్నాయి.

ప్రాణం మీద మనిషి కెంత తీపో తెలిపేటందుకు నిదర్శనంగా ఆ వార్త నిజానిజాలడుగుతూ ఫోన్ కాల్స్.

ఈ వార్తని వెల్లడించిన ప్రొఫెసర్ క్వాలిఫికేషన్లు సామాన్యమైనవి కావు. ఈ విషయం ఎంక్వయిరీ చేసిన ఎడిటరు శైలజని వెంటనే డిల్లీ పంపేడు.

ఇలాంటి వార్తలే పత్రిక సర్క్యులేషన్ పెంచేవి. అందులోనూ ఏ పత్రికా వెయ్యని వార్త అది.
తను కనుక్కొన్న దానిమీద ఎడిటర్ ఉత్సాహం చూపించటంతో శైలజ సంతోషం పట్టశక్యం కాలేదు. ఆ రోజు ఆమె డిల్లీ వచ్చేసింది.
ఆమె ప్రొఫెసరుని కలుసుకొనే సమయానికి భూమియొక్క ఆఖరి క్షణం ఎప్పుడూ అన్నది కరెక్టుగా లెక్క కట్టేడు. అలాగే చంద్రుదు తన పరిధి నుంచి తప్పుకొని ఎప్పుడు స్మాష్ అయిపోతాడూ అన్న విషయం కూడా.

మొదటిది ఆగష్టు పదిహేడు, రాత్రి పదకొండు గంటలా మూడు నిముషాల అయిదు సెకన్లకి.
రెండోది ఆగష్టు ఆరో తారీఖు, రాత్రి పన్నెండు గంటలా మూడు నిముషాల అయిదు సెకన్స్లకి.

ప్రధాన మంత్రికి అందించటం కోసం రిపోటు తయారు చేస్తూండగా శైలజ ఆ గదిలోకి అడుగుపెట్టింది.

రమణ సంభ్రమాశ్చర్యాల్తో "ఇదేమిటి, మీరిక్కడికి వచ్చేరు?"
ఆమె నవ్వి వూరుకుంది.
ప్రొఫెసరు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రలేదతనికి. ఆ రాతిలో వున్న లోహమూ చంద్రశిలలో వున్న లోహమూ ఒకటేనని తెలిసిన దగ్గర్నుంచి అతడి మొహంలో నవ్వు మాయమైంది. అయితే అతనిది ప్రాణభయం కాదు. అతడికి తెలుసు, భూమి నాశనం కాబోతోందనీ, దేవుడనేవడే వుంటే, వాడు కూడా దాన్ని రక్షించలేడనీ.
కొత్త విషయాన్ని కనుక్కొనే ఉత్సాహంతో యింతవరకు ముందుకు సాగేడు. కానీ చివరికి అంతా కనుక్కొని వెనుదిరిగి చూసుకొంటే..... తను సాధించినదేమిటి?
డిస్ట్రక్షన్- సర్వనాశనమ్!!

అతడికి నవ్వూ, ఏడుపూ, ఒకేసారి వచ్చినాయ్. అన్నీ ఫీలింగులకూ అతీతుడైన ఆ వృద్దుడి మనసులో కలవరం మొదలయింది.
"ఏం కనుక్కొన్నారు?" శైలజ అడిగింది.
"చాలా గొప్ప విషయాన్ని కనుక్కొన్నాం!" అన్నాడు రమణ ఉరకలేస్తున్న ఉత్సాహంతో, "రేపు రాత్రికి ...."
"ఆగు....!" అరిచేడు ప్రొఫెసర్,
రమణ చెబుతున్నది ఆపి, చిత్రంగా అతడివైపు చూసేడు "ఈ విషయం వెల్లడి కావటానికి వీల్లేదు" అన్నాడు. అతది ముడతలుపడ్డ చెక్కిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. కళ్ళు తీక్షణంగా వెలుగుతున్నాయి. మనిషి ఆవేశంతో వూగిపోతున్నాడు. పిడికిళ్ళు బిగించి "ఈ విషయం వెల్లడించటానికి వీలులేదు. ముఖ్యంగా పత్రికల వాళ్ళకి_"అన్నాడు. ఇన్నాళ్ళూ మిగతా అబ్జర్వేటరీస్ అన్నీ యీ విషయాన్ని యెందుకు వెల్లడి చేయలేదు? అమెరికా, రష్యాలు ఎందుకు చెప్పలేదు? ప్రొఫెసర్ కి యిప్పుడు అర్థమయింది... ఈ విషయం వెల్లడి చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటి? కేవలం ప్రజల్లో భయోత్పాతం తప్ప. చావు ఎలానూ తప్పనప్పుడు అది తెలియకుండ చావటమే మంచిది. అంతా నిశ్శబ్దంగా జరిగిపోవాలి. తమ పరిశోధన తమతోనే అంతం అయి పోవాలి... ఈ ఆలోచనలతోనే అతడు చెప్పొద్దన్నాడు.

రమణ అతనివైపు నిదానంగా చూసేడు.
రమణ ఆలోచన్లు వేరు. ఇంకోలా అర్థంచేసుకొన్నాడు.
ప్రపంచం ఇక పన్నెండు రోజుల్లో ఆఖరవబోతుంది. ఆ విషయం అందరికీ తెలిస్తే.... దీన్ని యీవిపత్కర పరిస్థితినుంచి రక్షించటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ప్రతి సైంటిస్టూ ప్రాఆలు ధారపోసి దాన్ని ఆపటానికి పరిశోధనలు మొదలుపెడ్తాడు. ఈ వృద్దుడు ఎందుకు తనని చెప్పొద్దంటున్నాడు__?
అతడికి చప్పున ఓ విషయం అర్థమయింది.
నోబుల్ ఫ్రైజ్!
అవును. నోబుల్ ఫ్రైజ్!
ఈ పదిరోజులు ఏదయినా కృషిచేసి, దీన్ని తనే సాధించాలని ఈ ప్రొఫెసర్ ప్రయత్నం. ఒకవేళ తను సాధించలేకపోతే ఈ ప్రపంచం నాశనమైనా దానికి సిద్దపడ్తాడు కానీ, యీ అవకాశం మరొకరికి దక్కనివ్వడు.
'మనిషెంత స్వార్థపరుడు?' అనుకున్నాడు రమణ.
ఒకవైపు కొంపలంటుకుపోతూ వుంటే, ఇంకోవైపు అందులో తనకేం దొరుకుతుందా అని వెతుకుతున్నాడు ప్రొఫెసర్.
అతడో నిర్ణయానికి వచ్చేడు. ప్రొఫెసర్ వైపు సూటిగా చూసి "నేను చెప్పాలి. చెప్పకుండా నన్నెవరూ ఆపుచెయ్యలేరు" అన్నాడు. అని, ఆమెవైపు తిరిగి, "రేపు రాత్రి పన్నెండుగంతలకి...." అంటూ ఏదో చెప్పబోయాడు.
ప్రొఫెసరు కదిలేడు. నరనరాల్లో వున్న బలం అంతా చేతుల్లోకి తెచ్చుకొని, రమణ నోరు ముయ్యటానికి ప్రయత్నించేడు. కానీ అతని బలం చాలేదు. ఒక్క విసురుతో పడిపోయాడు.

రమణ ఆమెవైపు తిరిగి, "మన పత్రికకి ఒక న్యూస్! ఎవరూ నమ్మలేనిది. కానీ పచ్చినిజం. ఎవరూ నమ్మకపోయినా అది నిజం! ఈ ప్రొఫెసర్ ఎంత గొప్పవాడో నాకు తెలుసు. కేవలం స్వార్థంవల్ల ఇలా అయ్యేడు కానీ నిజంగా గొప్పవాడు. అతడి లెక్క తప్పటానికి వీల్లేదు. శైలజగారూ వినండి! తేపు చంద్రుడికి ఆఖరు రాత్రి. స్మాష్..... చంద్రుడు స్మాష్ అవబోతున్నాడు. ప్రకటించండి. మన పత్రికలో పెద్ద అక్షరాలతో ప్రకటించండి. ప్రపంచపు భవితవ్యం రేపు రాత్రి పన్నెండు గంటలకి తేలిపోతుంది. అందర్నీ చూడమనండి. ప్రపంచాన్ని రక్షించటానికి అందర్నీ నడుం కట్టమనండి...."

శైలజ వడివడిగా బయటకు వెళ్ళిపోయింది. సంభాషణ వింటున్న ఒక స్వీపరు అక్కడ్నుంచి తప్పుకొన్నాడు.
గదిలో నిశ్శబ్దం ఆవరించింది.

ఒక మూలగా పడిపోయిన వృద్దుడు మోచేతులమీద బలంగా లేవటానికి ప్రయత్నం చేస్తూ, "ఎంత పని చేశావురా మూర్ఖుడా!" అన్నాడు. "ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత కల్లోలం! ఇది మిగతా సైంటిస్టులకు తెలియకనా వాళ్ళు ఊరుకొన్నది! ఈ పదకొండు రోజులు ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. భగవంతుడా ఎలా ఇప్పుడు....??"


*****************************************************************

No comments:

Post a Comment