Monday, October 7, 2019

-- యుగాంతం(Yugantham) - 24

పదిహేను రోజులు వెనక్కి.
శాన్ ఫ్రాన్సిస్కో:

"ఈ విషయం అందరికీ తెలిస్తే...." అన్నాడు విలియం రోగర్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్.

ఎవరు మాట్లాడలేదు.

మెక్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. జాన్ కళ్ళతోనే విష్ చేశాడు. అతడే అందర్లోకి యువకుడు.
తెలతెలవారుతోంది.
"ఏమిటీ సంగతి...? " కంఠం తగ్గించి అడిగేడు మెక్.

అందరి మొహాలూ సీరియస్సుగా ఉన్నాయి. జాన్ మౌనంగా ఓ కాగితాల కట్ట అందించేడు. దాదాపు పది పేజీలున్న రిపోర్ట్ అది. ఒక మూలగా 'మౌంట్ పలామోర్ అబ్జర్వేటరీ, కాలిఫోర్నియా' అని వుంది. తొందర తొందరగా కళ్ళతో చదవసాగేడు.

పూర్తి చేయడానికి అయిదు నిమిషాలు పట్టింది.

ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమివైపుకు వస్తున్నది అన్న విషయాన్ని ముందు కనుక్కొన్నది రాయల్ అబ్జర్వేటరీ. వెంటనే గ్రీన్ విచ్ ని కాంటాక్ట్ చేసేరు వాళ్ళు. రేడియో ఆస్ట్రలాజికల్ పరికరాల ద్వారా అది ఎంత వేగంతో వస్తున్నదీ, ఆ దిశగా వస్తున్నదీ కనుక్కోబడింది.

ఈ విధంగా ప్రొఫెసర్ ఆనందమార్గం కనుక్కొన్న విషయం అంతకు పదిహేను రోజుల ముందే సరి అయిన తేదీ, సమయంతో సహా గ్రహించబడింది.

ఆగష్టు పదిహేడు, పదకొండు గంటలా పది సెకన్లకి ఆ గ్రహం భూమి ఆకర్షణ పరిధిగుండ మూడు సెకన్లకాలం పయనిస్తుంది. భూమి అడుగుపొరల్లో వుండే ఇనుము, లావ దాని ఆకర్షణ శక్తికి లోనై పెల్లుబుకుతాయి!

మిలియను సంవత్సరాల వయస్సున్న యీ భూమ్మీద చరాలన్నీ గుర్తుకూడా మిగలకుండా నాశనమైపోతాయి. విశ్వంలో వున్న కోట్ల కోట్ల గ్రహాల మాధిరిగానే భూమి కూడ నిస్తేజమైపోతుంది.

సముద్రాలు ఇంకిపోయి వాటిమీద లావా గట్టిపడుతుంది.

రెండు పరమాణువులున్న్ ఆక్సిజన్ మూడో దాన్ని చేర్చుకొని ఓజోనుగా మారుతుంది.

భూమ్యాకర్షణ పరిధిలోకి ఆ నక్షత్రం రాగానే ఆ కుదుపుకి భూకంపం కలుగుతుంది. అగ్నిపర్వతాలు బ్రద్దలవుతాయి....

ఇక చదవలేదు అతడికి పరిస్థితి అర్థమయింది.

ఆయితే అది నిజమని నమ్మటానికే కొద్ద్దిగా సమయం పట్టింది. ఎక్కడో లాస్ ఏంజిల్స్ లో వెచటి రగ్గుకింద పడుకున్న వాణ్ని లేపి ఇంకో రెండు నెలల్లో ప్రపంచం నాశనమైపోబోతూంది అని చెప్తే అంత తొందరగా నమ్మబుద్దికాదు. కల అయితే బావుణ్ను అన్న భావన.

"ఇదంతా నిజమా_ నిజంగా ఇలాగే జరుగుతుందా? ఆ నక్షత్రం తనదారి మార్చుకొనే వీలే లేదా_? ఈ ప్రశ్నలన్నీ రిపోర్టు చదవగానే నా కొచ్చినయ్" అన్నాడు రోగర్స్ . "దీనికి సమాధానం ఆగష్టు ఆరో తారీఖున తెలుస్తుంది. ఎలా అని ప్రశ్నించకండి. ఈ ఒక్క్ అవిషయమూ రహస్యంగా ఉంచబడింది. అయితే అంతకన్నా ముఖ్య సమస్య ప్రెస్. ఈ విషయం బయటకు పొక్కగానే పత్రికలు దీన్ని తమ సర్క్యులేషన్ పెంచటానికి సాధారణంగా ఉపయోగించుకుంటాయి."

"అందరికీ తెలిస్తే ఏమవుతుంది?" ఫిన్చ్ అడిగాడు.

అప్పటివరకూ మౌనంగా కాగితాలు పరిశీలిస్తున్న కాస్టనోవా తలెత్తి నెమ్మదిగా అన్నాడు. "ఏమవుతుంది అని అడుగుతున్నావా మిస్టర్ పిన్చ్, ఈ నలభయి రోజుల్లోనూ ఘాతుకాలు జరుగుతాయి. ప్రాణం ఎలాగూ పోతున్నదని తెలిసినప్పుడు మనిషి పనిచెయటం మానేస్తాడు. ఎఫ్.బి.ఐ. వుండదు. ప్రాణమే పోతున్నప్పుడు నైతిక విలువలెందుకని మనిషి వాటిని వదిలేస్తాడు. పోలీస్ వుండడు.

గత పదకొండు సంవత్సరాలుగా వాషింగ్టన్ లో అయిదు వందల శాతం నేరాల సంఖ్య పెరిగింది. ఈ నలభై రోజుల్లో అవి పదిహేను వందల శాతం అవుతాయి. రోజుకి ఎనభై రాబరీలవుతున్నాయి. అవి ఎనిమిది వందలు అవుతాయి. రేప్ లు మనం అంచనా కట్టలేనంతగా పెరిగి పోతాయి. ఏం అవుతుందని అడక్కండి. ఏం ఆవదని అడగండి. మనుషుల బలహీనతలు మనకు తెలుసు. వచ్చే ప్రళయం ఎలానూ తప్పనప్పుడు దాన్ని ముందుగా వెల్లడించి కల్లోలం సృష్టించటం అవివేకం. ఆపటానికి శాయశక్తుల కృషిచేద్దాం కానీ ఆపగలమని అనుకోను. ప్రకృతిముందు మనిషెంత....? మనం చెయ్యగలిగిందొక్కటే, మన ప్రయత్నాలు మనం చేస్తూ ప్రపంచానికి యీ విషయం తెలియకుండా ఆపుచెయ్యటం. అబ్జర్వేటరీస్ అన్ని మూసెయ్యాలి. ఏదో మిషమీద ఆస్ట్రానమిస్ట్ ల నందర్నీ అరెస్ట్ ... నా ఉద్దేశ్యం జైలు కాదు.... అరెస్ట్ చెయ్యాలి. రాబోయే చావుని తల్చుకొని మనిషి చచ్చిపోవచ్చు _ లేదా మనిషిలో రాక్షసుడు విజృంభిమ్చవచ్చు. ఈ రెంటినీ మనం సాధ్యమైనంత కాలం ఆపు చెయ్యాలి.... రాక్షసుడు పుట్టకుండా మనిషి చావకుండా మనం ఆపు చెయ్యాలి"

అందరూ లేచారు.
సమావేశం ముగిసింది.

*******************************************************************************

No comments:

Post a Comment